Thursday 24 April 2014

FIGHT WITH VOTE

నా చెల్లెళ్ళ దేహాల నిండా పిచ్చికుక్కల గాట్లు... 
వారి చూపుల్లో బాధలు- కోట్ల ఆక్రందనలు... 
ఉష్ భరించలేను - గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఆత్మాహుతి చేసుకున్న రైతన్నల కళేబరాలు  
వారి పిల్లల ఆకలి కేకలు- భీకర ఘోషలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

నా తమ్ముళ్ళ చేతుల్లో పనికిరాని పట్టాలు 
వారి తల్లిదండ్రుల ఆవేదనలు- పెల్లుబికే ఉక్రోషాలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ప్రభుత్వ ఆఫీసులలో పత్రాల కోసం పడిగాపులు 
సిగ్గులేని వారి  వ్యవహారాలూ- వ్యవస్థపై హేళనలు 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఈ నాయకుల బూటకపు మాటలు 
పార్టీల నాయవంచనలు- నిలువు దోపిడీలూ 
ఉష్ భరించలేను- గుండెలో మంట, నరాల్లో తెగింపు!

ఇవాళ నా కసి వెలిగించిన నెత్తుటి  మంటల్లో నిలబడి చెబుతున్నా...
"రైట్ టు వోట్" కాదు "ఫైట్ విత్ వోట్"... 
ఈ దోపిడీ రేచుకుక్కల్ని తరిమితరిమి కొట్టండి!