Saturday 18 June 2022

Samudram part-1

నేను పిచ్చాసుపత్రిలో ఉన్నప్పుడు వచ్చింది ఆ ఈమెయిలు 
ఒక పత్రిక వాళ్ళు పంపింది. ప్రత్యేక సంచికకు కథ రాయమని. మా అమ్మ చెప్పింది నాకు ఆ విషయం.
ఆవిడ నేను ఆసుపత్రిలో ఉన్న విషయం రహస్యంగా ఉంచింది. ఒక్క మా ఇంటి వాళ్ళకే తెలుసు. నాకు పిచ్చెక్కిన సంగతి అందరికి తెలియడం ఆమెకు చిన్నతనంగా అనిపించింది. కొంతకాలం చూసి బాగ్గాకపోతే అప్పుడు అందరికి చెప్పొచ్చు అనేది ఆవిడ ఉద్దేశం. 
నా వైపు చూసింది. ఆ చూపులో చాలా అర్దాలతో పాటు కథ రాస్తావా  అనే ప్రశ్న కూడా ఉంది. 
"మూ?"  అంటూ తలతో అడిగింది ఊపి.
గద్దిన్చినట్టుగా  ఉంది ఆమె ధోరణి.
"రాస్తాను" అన్నాను 
"ఈ కండిషన్లోనా?" అంది ఆపిల్ని చేతిలోకి తీసుకుంటూ.
"సరే రాయి నీకు కూడా   కాస్త ఊరటగా ఉంటుంది"
'ఏ కండిషన్లో?' అని గొడవ పెట్టుకుందామని నోటి దాకా  వచ్చి ఊరుకున్నాను. పిచ్చి వాళ్ళు చేసే మొదటి వాదన తమకి పిచ్చి లేదనిట పైగా.
"రాయను. చెబుతాను. నువ్వు రాసి పెడతావా?"
తల ఊపింది అంగీకారంగా 
"పెన్నుతో రాయాలి అయితే" అన్నాను.
అదోలా చూసింది. నేను రాబోతున్న కోపాన్ని ఆపుకున్నాను.
********************
వారం నుంచి వస్తోంది ఆ కల.
అతడు అంతవరుకు అటువంటి కలను ఎరగడు.
అపార జలరాశి కనుచూపు మేరదాకా! పొగమంచులో కలిసిపోయిన అంతులేని తీరం ఎన్ని యోజనాలుందో ఎవరికీ తెలిదు. ఏవేవో పక్షులు. ఒడ్డంతా ఇసుకపిండి. ఆ అనంత జలరాశికి ఊపిరితిత్తులు కనుక ఉండి ఉంటే, అవి తీసే శ్వాస లాగే ఉంది దాని నిరంతర హోరు. దేవుడు తనకోసం చేసుకున్న అద్దంలా మెరిసిపోతున్న ఆ దృశ్యం ఎవరూ ఊహించడానికి వీల్లేనిది.

చాలామంది పండితుల్ని సంప్రదించి చాలా గ్రంథాల్ని పరిశోధించాక సముద్రం అంటారని తెలిసింది అతడికి. అది ఎంతో దూరంలో భూగోళానికి అవతలివైపు ఉంటుందట.
 
ఎప్పుడైతే దానికొక పేరు ఖాయం అయ్యిందో అప్పట్నుంచి ఆ కల రావడం మానేసింది. సముద్రస్వప్నం కోసం ఎదురుచూసి ఎదురుచూసి నిస్సారంగా గడుస్తున్నాయి అతడి రోజులు.
రాజుని చుసిన కళ్ళతో మొగుణ్ణి చూసినట్టుంది మిగితా లోకం అతడికి.

 నిజానికి అతడే ఒక రాజు.

దేశంలోని మహాపర్వతాలు, దుర్గామారణ్యాలు , నేలను తాకేంత దెగ్గరగా సాగిపోయే మేఘాల గుంపులు, జలపాతాలు, విశాల జలాశయాలు అతడ్ని తృప్తిపరచలేకపోయాయి. పదేపదే ఆ సముద్ర దృశ్యం గుర్తొచ్చి అతడ్ని నిర్వీర్యుడిని చేస్తోంది.

సముద్రం ఎలాగైనా ఉండాల్సిందే!

దేశాధినేతగా అతనికి ప్రజలు ఇవ్వగలిగిన బహుమతి ఏదైనా ఉంటే అది సముద్రమే. అంతకన్నా గొప్పది ఈ సృష్టిలో మరొకటి లేదు. ఈ నిర్ణయానికి రావడానికి చాలా సమయాన్నే తీసుకున్నాడు. ఎన్నో వైపులనుంచి ఆలోచించాల్సిన బాధ్యత అతడిది. 

ఓ రోజు కిక్కిరిసిన సభలో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటనకు ముందే సముద్రాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించాడు. మహాసేనల్లాగా మునుముందుకు ఉరికే అలల గురించి చెబుతున్నప్పుడు అందరు ఊపిరి తీసుకోవడం మరిచిపోవడాన్నిఅతడు గమనించాడు. అలల తుంపరల్లాగా  లక్షలాది పక్షుల విహారాన్ని వివరిస్తున్నప్పుడు అందరి కళ్ళల్లో చిప్పిల్లుతున్న వెలుగు రవ్వల్ని చూసాడు. అందరు సముద్రపు హోరును తమ హృదయ లయల్లోకి ఆవాహన చేసుకుంటున్న ఉత్తేజిత క్షణాల్లోనే అతడి నిర్ణయాన్ని ప్రకటించాడు అదను చూసి. 

అందరు ఉద్వేగంతో కెరటాల్లాగా నిలబడ్డారు. ఏవేవో నినాదాల ద్వారా తమ సమ్మతిని ప్రకటించారు. సముద్రపు హోరు అప్పుడే మొదలయినట్టు అనిపించించి దేశాధినేతకి.
***********

సముద్రాన్ని తవ్వడానికి ఓ శుభముహూర్తాన్ని నిర్ణయించారు సిద్ధాంతులు. ముహూర్తానికి చాలా ముందే ప్రజలందరూ తమ బంగారాన్ని ఖజానాకి అడగకుండానే ఇచ్చేసారు. భవిష్యత్ భయాన్ని సముద్ర కోరికతో జయించిన ప్రజలు. 

బంగారమంతా ఇనుప గునపాలుగా మారింది.

"ఎంతో కాలంగా మనం సంపాదనని పోగు చేయడానికి బ్రతికాం. బ్రతుకుతున్నాం. ఒక భరోసా తప్ప ఏమైనా ఉందా అందులో. ఇక నుంచి ఒక అనుభూతి కోసం బ్రతకబోతున్నాం."
దేశాధినేత మనసు పరవళ్ళు తొక్కింది. "మనం చేస్తున్న పని ఈ భూమ్మీద ఎవరు కల కూడా కనలేనిది."

"మన ముందున్నది ఒకటే. తవ్వడం. మనం తవ్వుదాం. ఎప్పటికి పూర్తి అవుతుందో ఆలోచించడం మన పని కాదు. దాన్ని కాలం చూసుకుంటుంది. నీళ్ళు ఎలా నింపాల అనేది కూడా మన పని కాదు. దాన్ని ఆకాశం చూసుకుంటుంది. మన పని కేవలం తవ్వడం. ఇంతకాలం యుద్దాల్ని ఎలా తెగించి చేసామో అలా  చేయడం." అంటూ గునపాన్ని నేలలోకి దించాడు దేశాధినేత. 
కొన్ని లక్షల గునపాలు నేల వైపు దూసుకుపోయాయి.

**********

కళ్ళు తెరిచాను. 
మా అమ్మ, తమ్ముడితో పాటు ఇద్దరు నర్సులు, కొంతమంది అటెండర్లు చుట్టూ గుమిగూడి శ్రద్ధగా వింటున్నారు. అంతకు ముందు రోజు నేను చేయి చేసుకున్న అటెండరు కూడా ఉన్నాడు వాళ్ళలో డబ్బుల్ని చింపనీకుండా అడ్డుకోవచ్చా నన్ను మరి!?
కథను కొనసాగించాను కళ్ళు మూసుకుని.

No comments:

Post a Comment