Wednesday, 31 July 2013

కలల డోలికలు

___________________________________________________
మదిలో ఎన్నో ఆలోచనలు మెదలగా 
         కొన్ని కలలుగ రూపాంతరం పొందాయి 
ఆ కలలకు రెక్కలు తగిలించి వదలగా
         కొన్ని అనంతాకాశంలో డోలికలాడాయి  


మరికొన్ని మేఘాల చెంత నీడ పొందగా  
          అప్పుడప్పుడు వాటికి మెరుపులు తగిలి ఉప్పొంగాయి 
మృదువయిన  కలలు రంగులతో ఆడుతూ 
           మేలిమి కాంతిధారలతో కొత్త ప్రపంచాన్నే సృష్టించసాగాయి 


తమ ఊహావిహంగాలతో, కవనపు తోటలో నర్తిస్తూ 
            సరికొత్త ఉదయాలు, అపరిమిత బాటలు వేయసాగాయి       బహుదూరపు ప్రయాణంలో చిట్టి చిట్టి అడుగులు వేస్తూ 
            అమాయకపు కలలు తమ తమ గమ్యాల వైపు నడవసాగాయి  


దీపపు వెలుగులో సూర్యుడి వెలుతురు కనబడకపోతే 
             అలిసిపోయి అదే దీపపు వెలుగులో సమసిపోయాయి 
సమయం ముందుకు కదిలిపోతే 
             కలలు వెనకబడిపోయాయి 
               కొన్ని మిగిలిపోయాయి 
             కొన్ని పగిలిపోయాయి 
             మరికొన్ని వాటి మీద అవే నవ్వుకున్నాయి 
             

జీవితపు ఆటలోజీవితాన్నే ఓడిపోయినట్టు అనిపించగా,
 అసంపూర్ణ కలల సౌధంతో మిగిలిపోగా, 
వెనక్కి తిరిగి చూస్తే కథలా మిగిలిన నా చరిత్ర కనిపించగా......  


నిట్టూరుస్తూ నా మది అడిగింది
ఇదేనా ఆలోచనలకు తుది ఘట్టం?
ఇక్కడేనా కలల అస్తమయం? 
ఇంతేనా జీవిత పరమార్ధం?



ఉవ్వెత్తున ఎగిసిన నా మనసు సమాధానం ఇచ్చింది 
ఆపావా ఊపిరి తీసుకోవడం?
ఆగిందా గుండె కొట్టుకోవడం?
ఆగరాదు   ఆలోచన-కలల పర్వం 

ఎందుకంటే.... 
మెరుస్తుంది మళ్ళీ నీకు ఒక ఆలోచన నింగిలో తారలాగ!
నీ భవిష్యత్తుకు పునాది రాయిలాగ......!


Saturday, 27 July 2013

యువతరంగ రధచక్రాలు

వస్తున్నాయ్ వస్తున్నాయ్  జగన్నాథ రధచక్రాలొస్తున్నాయ్
మీ 
మాటలకి అలసిన 
చేతలకి రగిలిన 
కూతలకి విసిగిన 
అసత్యాలనెరిగిన 
 నవ యువతరంగ రధచక్రాలొస్తున్నాయ్ 

మహాత్ముడు మార్చి కాలగతిని
తెచ్చిన  దెశాన్ని దోచుకుతిని,
రైతుల కళేబరాలు  కాలగా తిని,
దేశ ప్రయోజనాలు తెల్ల టోపీలలో దాచుకుతిని 
బ్రతుకుతున్న మీరా మా నాయకులు?
లేదుసమాజానికి పట్టిన చీడ పురుగులు 


ఒకడు అసెంబ్లీలో చూస్తాడు బూతుబొమ్మలు 
మరొకడు గవర్నర్ గిరీ పేరిట రచించాడు శృంగార లీలలు 

ఒకడు అమ్మేశాడు రాష్ట్రం 
ఇంకొకడు తినేశాడు భూగర్భం 

2జి కుంభకోణం 
కామన్వెల్తు భాగోతం 

చస్తోందిరా సామ్యవాదంపై నమ్మకం 

 గణగణ రణగొణ ధ్వనులనుంచి,
గజిబిజి జీవితపు పరుగులనుంచి 
లేస్తున్నాం 

భగభగ మండే నిప్పుల కొలిమి వలె 
ధగధగ మెరిసే ఆశాజ్యోతి వలె 
వస్తున్నాం 

రాజకీయాల్లోకి వస్తాం 
నాయకులమౌతాం 
మీ నిగ్గు తేలుస్తాం 
పంచెలూడదీస్తాం 
ప్రభంజనం సృష్టిస్తాం 
కొన ఊపిరితో ఉన్న భారతమాతకు మా  శ్వాసనందిస్తాం 

 నేతలమంటూ తిరుగుతున్న దగాకోరులారా  

డబ్భై కోట్ల యువత ఒక్కటై
సింహాలవలె గర్జిస్తాయ్ , గాండ్రిస్తాయ్ 
 వివేకానందుడి సూక్తులే ఊపిరై 
సముద్రపు అలలవోలె మహాసేనల్లా కదం తొక్కుతాయ్ 
మీ నాయకత్వాలని అధినాయకత్వాలని చెరుపుతాయ్

 యువ గుండెల  నిప్పుకణాలు  
కట్టుకుని కంకణాలు
బయలుదేరితే చేర్చుకుని గణాలు
పెట్టలేవా '-భయపెడుతున్న 'హస్తంమీద చురకలు?

మీ అతలాకుతల ప్రభుత్వానికి పాఠాలు నేర్పుతాయ్ 
మీ నాయకుల అఘాయిత్యాలకు చరమాంకం పాడతాయ్ 
వస్తున్నాయ్ వస్తున్నాయ్ 
యువతరంగ రధచక్రాలొస్తున్నాయ్