Wednesday, 31 July 2013

కలల డోలికలు

___________________________________________________
మదిలో ఎన్నో ఆలోచనలు మెదలగా 
         కొన్ని కలలుగ రూపాంతరం పొందాయి 
ఆ కలలకు రెక్కలు తగిలించి వదలగా
         కొన్ని అనంతాకాశంలో డోలికలాడాయి  


మరికొన్ని మేఘాల చెంత నీడ పొందగా  
          అప్పుడప్పుడు వాటికి మెరుపులు తగిలి ఉప్పొంగాయి 
మృదువయిన  కలలు రంగులతో ఆడుతూ 
           మేలిమి కాంతిధారలతో కొత్త ప్రపంచాన్నే సృష్టించసాగాయి 


తమ ఊహావిహంగాలతో, కవనపు తోటలో నర్తిస్తూ 
            సరికొత్త ఉదయాలు, అపరిమిత బాటలు వేయసాగాయి       బహుదూరపు ప్రయాణంలో చిట్టి చిట్టి అడుగులు వేస్తూ 
            అమాయకపు కలలు తమ తమ గమ్యాల వైపు నడవసాగాయి  


దీపపు వెలుగులో సూర్యుడి వెలుతురు కనబడకపోతే 
             అలిసిపోయి అదే దీపపు వెలుగులో సమసిపోయాయి 
సమయం ముందుకు కదిలిపోతే 
             కలలు వెనకబడిపోయాయి 
               కొన్ని మిగిలిపోయాయి 
             కొన్ని పగిలిపోయాయి 
             మరికొన్ని వాటి మీద అవే నవ్వుకున్నాయి 
             

జీవితపు ఆటలోజీవితాన్నే ఓడిపోయినట్టు అనిపించగా,
 అసంపూర్ణ కలల సౌధంతో మిగిలిపోగా, 
వెనక్కి తిరిగి చూస్తే కథలా మిగిలిన నా చరిత్ర కనిపించగా......  


నిట్టూరుస్తూ నా మది అడిగింది
ఇదేనా ఆలోచనలకు తుది ఘట్టం?
ఇక్కడేనా కలల అస్తమయం? 
ఇంతేనా జీవిత పరమార్ధం?



ఉవ్వెత్తున ఎగిసిన నా మనసు సమాధానం ఇచ్చింది 
ఆపావా ఊపిరి తీసుకోవడం?
ఆగిందా గుండె కొట్టుకోవడం?
ఆగరాదు   ఆలోచన-కలల పర్వం 

ఎందుకంటే.... 
మెరుస్తుంది మళ్ళీ నీకు ఒక ఆలోచన నింగిలో తారలాగ!
నీ భవిష్యత్తుకు పునాది రాయిలాగ......!


No comments:

Post a Comment