Friday, 9 August 2013

ఓ యువ ప్రతినిధీ.....

యువతరపు ప్రతినిధిని అంటావు........ 

ఒక భగీరథుని తపమునకు యువతరమంతా తోడయ్యినపుడు  
                     అర్ధరహిత నపుంసకపు మౌనమే నీ భాష ఆయెనే!
ఒక యువతి కలల సౌధం చెదిరి దేశమంతా రగిలినపుడు  
                     అసలు సిసలు రాజకీయవాదమే నీ మాటలనేలెనే!

ఇంటి పేరు కవచమువోలె కాపాడుననుకున్నావా?
                     తల్లి పేరు కుండలములను మించిన రక్షణనుకున్నావా?
కవచకుండలములతోడి జనియించిన వానికే తప్పలేదు అవహేళనము
                     నీవొచ్చి సింహాసనమునధిష్టించెదననగనే కట్టేస్తామా పట్టము?

నలువైపులా వందిమాదిగులను ఏర్పర్చుకున్నావు
                      వారు నేర్పుదురా నీకు యువతరపు నవయోచనలు!! 
వారు ఎటువంటి ఆలోచనా సరళి నుంచి పుట్టినవారనుకున్నావు 
                      కారా వారు ఈ కుళ్ళిన రాజకీయ వృక్షపు నల్లకుసుమాలు?

క్షత్రియుడవవలెనన్న ముందు క్షాత్రుడవవలె 
                      క్షాత్రుడివవలెనన్న ముందు మదిలో ప్రశ్నలుండవలె 
సమాధానములు  తెలుసుకొవలెనన్న కుతూహలముండవలె 
                      లేనియెడల క్షత్రియుడవ్వవలెనన్న తలపు త్యజించవలె

పాలకుల కుటుంబంలో పుట్టితివి  ప్రశ్నలే తెలియనివాడివి 
జవాబులున్నాయని బయలుదేరినవాడివి 
పగటి చీకట్లను చూడలేని కబోదివి
ఆకలి కేకలు వినలేని చెవిటివాడివి 
అన్యాయాన్నిఎదిరించని మూగవాడివి 
మా ఆంతర్యాలు పసిగట్టలేనివాడివి 
నీవేల మమ్మేలవచ్చితివి?



No comments:

Post a Comment